DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఇళ్లులేని నిరుపేదల ఆవేదనను పట్టించుకోకుండా ప్రభుత్వం ఖాళీ హామీలతో ప్రజలను మోసం చేస్తోందని సిపిఐ జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య తీవ్రంగా విమర్శించారు. మంగళవారం సిపిఐ ఆధ్వర్యంలో పట్టణ మండలం 2 కార్యదర్శులు టి. వీరేష్, మధిరె ఎల్లప్ప నాయకత్వంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బి. గిడ్డయ్య మాట్లాడుతూ పేదల సమస్యలపై ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యంపై మండిపడ్డారు. పేదలకు ఇళ్లు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటికీ అమలు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు భూమి ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, రెండు సంవత్సరాలు పూర్తవుతున్నా ఆ హామీలను నెరవేర్చకపోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. ఖజానా ఖాళీ అయిందని సాకులు చెప్పడం నిరుపేదలపై చేసిన ద్రోహమని అన్నారు. ఇప్పటికే ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయకపోతే సిపిఐ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని, అవసరమైతే సబ్ కలెక్టర్ కార్యాలయం మాత్రమే కాదు, కలెక్టర్ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి కే. రమేష్ కుమార్, లక్ష్మీనారాయణ, సత్యనారాయణ, AIYF పట్టణ కార్యదర్శి అంజిత్ గౌడ్, DHPS నాయకులు విజయ్, ప్రజానాట్యమండలి నాయకులు ఈరన్న, లింగప్ప, ఆటో వర్కర్స్ నాయకులు ఈరన్న, రామకృష్ణ, శంకర్, పుష్పరాజు, అస్లాం రాజు తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News