DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా రంగురంగుల కాగితాలు, రాళ్లతో ప్రజలను ఆకర్షిస్తూ అక్రమంగా వెంచర్లు ఏర్పాటు చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ పట్టణ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్న, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు గోపాల్, తిప్పన్న, మండల కార్యదర్శి లింగన్న తదితరులు మున్సిపల్ కమిషనర్ నయీమ్ కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆదోని పట్టణం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వ అనుమతులు లేకుండా ఆకర్షణీయమైన వెంచర్లు ఏర్పాటు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని తెలిపారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఎస్టేట్ల పేర్లతో విచ్చలవిడిగా వ్యాపారం సాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ అక్రమ వెంచర్ల కారణంగా ప్రజలు కబ్జాల భయంతో ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. కాబట్టి వెంటనే సంబంధిత అధికారులు స్పందించి ప్రభుత్వ అనుమతులు లేని వెంచర్లను నిలిపివేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Admin
DNB News