DNB News - ఆంధ్రప్రదేశ్ / : జిల్లాలో గ్యాస్ వినియోగం తగ్గించి ఇండక్షన్ స్టవ్, సోలార్, ఎలక్ట్రిక్ కుక్కర్ లాంటివి ప్రజలు వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉదయం కలెక్టరేట్ కార్యాలయం నుండి ఎల్పిజి గ్యాస్ అంశంపై డివిజన్, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... గ్యాస్ కొరత ఏర్పడిన సందర్భంలో ప్రజల అవసరాలను తీర్చేందుకు జిల్లాలో ఇండక్షన్ స్టవ్, సోలార్, ఎలక్ట్రిక్ కుక్కర్ ల సరఫరా పరిస్థితిపై పూర్తి సమాచారం సిద్ధంగా ఉండాలని తెలిపారు. హైదరాబాద్, బెంగళూరులోని తయారీ సంస్థలు మరియు వాటి సరఫరా సామర్థ్యంపై వివరాలు సేకరించాలని కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ నీరజకు ఆదేశించారు. జిల్లాలో ఇంటి ఇంటికి పైప్‌లైన్ గ్యాస్ సరఫరా లేకపోవడంతో ప్రత్యామ్నాయ వంట పద్ధతులపై దృష్టి పెట్టాలని సూచించారు. గతంలో కిరోసిన్‌ను వంట ఇంధనంగా వినియోగించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, కిరోసిన్ స్టౌవ్‌ల డేటా కూడా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే ప్రభుత్వం కిరోసిన్ సరఫరా చేపట్టే పరిస్థితుల్లో డేటా అందుబాటులో ఉండాలన్నారు. గ్యాస్ వినియోగాన్ని తగ్గించేందుకు సోలార్ కుక్కర్లు, ఎలక్ట్రిక్ కుక్కర్లు, ఇండక్షన్ స్టవ్‌ల పంపిణీపై ప్రణాళిక సిద్ధం చేయాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్‌కు సూచించారు. రాబోయే సమావేశం కోసం గ్యాస్ సరఫరా, కొరత పరిస్థితి, తీసుకుంటున్న చర్యలు, ప్రత్యామ్నాయ పరికరాల ధరలు, లభ్యత, అవసరమైన బడ్జెట్ తదితర అంశాలపై సమగ్ర పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సిద్ధం చేయాలని ఆదేశించారు.
Admin
DNB News