DNB News - ఆంధ్రప్రదేశ్ / : జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా కల్తీ ఆహార పదార్థాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఆదోని పట్టణంలోని పలు పాల డైరీలపై జిల్లా ఆహార భద్రత అధికారి (DFSO) రాజగోపాల్ రావు నేతృత్వంలో మెరుపు దాడులు నిర్వహించారు. ఇటీవల రాజమండ్రిలో కల్తీ పాలు సేవించి ఐదుగురు మృతి చెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమై రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలకు ఆదేశాలు జారీ చేసింది. దాడుల సందర్భంగా పాత పోస్ట్ ఆఫీస్ సమీపంలోని నాగరాజ్ మిల్క్ పార్లర్, గణేష్ సర్కిల్ వద్ద ఉన్న తిరుమల డైరీ, కౌడల్పేటలోని పల్లె పాలు విక్రయ కేంద్రాలను అధికారులు తనిఖీ చేశారు. ప్రతి డైరీ నుండి పాల శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపించారు. ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే కల్తీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఆహార భద్రత అధికారి రాజగోపాల్ రావు స్పష్టం చేశారు. ప్రజలు నాణ్యమైన ఆహార పదార్థాలను మాత్రమే వినియోగించాలని, అనుమానాస్పద పరిస్థితులు గమనించిన వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Admin
DNB News