DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు పశ్చిమ ప్రాంత సమగ్ర అభివృద్ధి, వలసల నివారణ, రైతుల సంక్షేమం కోసం ఆదోని జిల్లాను వెంటనే ప్రకటించాలని ఆదోని జిల్లా సాధన జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జేఏసీ ఆధ్వర్యంలో 107వ రోజు రిలే నిరాహార దీక్షను ఆదోనిలో నిర్వహించారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఆదోని, ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాలు దీర్ఘకాలంగా అభివృద్ధిలో వెనుకబడి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో వలసలు అధికమవడం, రైతుల ఆత్మహత్యలు, సరైన వైద్య సదుపాయాల లేమితో అంబులెన్సుల్లోనే ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు, విద్యార్థులు ఉన్నత విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లలేక మధ్యలోనే చదువులు మానేయాల్సి వస్తున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. అలాగే కార్మికులు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి ప్రమాదకర పనుల్లో నిమగ్నమై ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తగ్గాలంటే స్థానికంగా పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు రావాలన్నారు. ఎత్తిపోతల నీటి ప్రాజెక్టులు లేక సాగునీరు అందక పొలాలు బీడుగా మారుతున్నాయని, పంటల దిగుబడి పెరగాలంటే నీటి వనరుల అభివృద్ధి అత్యవసరమని పేర్కొన్నారు. ప్రజలు ఎటువంటి అదనపు అభివృద్ధి నిధులు కోరడం లేదని, కేవలం ఆదోని జిల్లాగా ప్రకటిస్తే పరిపాలన వికేంద్రీకరణతో అభివృద్ధి సహజంగానే జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదోని జిల్లా ప్రకటించాలని కోరుతూ తమ డిమాండ్‌ను పునరుద్ఘాటించారు. గతంలో కలగట్ల గ్రామంలో జరిగిన సభలో మెమరండం ఇవ్వడానికి వెళ్లినప్పుడు ప్రజల ఆకాంక్షను గౌరవిస్తామని చెప్పిన మాటలను నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. 107వ రోజు రిలే నిరాహార దీక్షకు మద్దతుగా దిబ్బనకల్లు ఉసేనప్ప, భూదెప్ప, కుమార్ (వైఎస్సార్ నగర్), గోవిందు, వెంకటేష్ దీక్షలో కూర్చున్నారు. కార్యక్రమంలో వై.పి. నాగరాజు, పగడాల కోదండ, టి. వీరేష్, సుజ్ఞానమ్మ, చంద్రబోస్, బండారి హనుమంతు, గుమ్మల బాలస్వామి, మలిగే రామలింగయ్య, గంగపుత్ర ప్రకాష్, జగదీష్, దాసరి నరేష్, దాసరి రామచంద్ర, దాసరి గోవిందరాజులు, జగన్ మాదిగ, వీరభద్ర స్వామి, రంగన్న తదితరులు పాల్గొని దీక్షను విజయవంతం చేశారు. ఆదోని జిల్లా ప్రకటించేంతవరకు తమ ఉద్యమం కొనసాగుతుందని జేఏసీ నేతలు స్పష్టం చేశారు.
Admin
DNB News