DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పరిధిలోని టిడ్కో ఇళ్లను రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప శనివారం పరిశీలించి అక్కడి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ 2014–2019 కాలంలో పేదల గృహ కలను నిజం చేయాలనే ఉద్దేశంతో కర్నూలు జిల్లా ఆదోని పరిధిలో దాదాపు 4 వేల టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టిందన్నారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లకు పార్టీ రంగులు వేయడం తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు చేయలేదని విమర్శించారు. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పేదలకు ఇంటి కల నెరవేర్చేందుకు మరమ్మతులు పూర్తి చేసి ఇప్పటికే నాలుగు లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందించామని తెలిపారు. టిడ్కో కాలనీలో నివసిస్తున్న ప్రజలు తమ సమస్యలను దేవేంద్రప్ప దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా రేషన్ సరఫరా సక్రమంగా జరగడం లేదని, పింఛన్లు ఇంటి వద్దకు అందడం లేదని, గ్యాస్ సిలిండర్ల పంపిణీ లేదని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పాఠశాల, ఆశా వర్కర్ల సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. ప్రజల సమస్యలను ఆదోని మున్సిపల్ కమిషనర్‌తో పాటు కర్నూలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని దేవేంద్రప్ప హామీ ఇచ్చారు. టిడ్కో కాలనీల్లో నివసిస్తున్న ప్రతి కుటుంబానికి మౌలిక వసతులు అందేలా ప్రభుత్వ అధికారులతో చర్చిస్తానని తెలిపారు.
Admin
DNB News