DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా తప్పుడు, ఆధారరహితమైనవని వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు బి. దేవా తీవ్రంగా విమర్శించారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్యే తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. జగనన్న కాలనీ భూసేకరణలో రూ.128 కోట్ల అవినీతి జరిగిందని ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని ఆయన అన్నారు. గత సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో 178 ఎకరాల భూమిని రైతుల నుంచి ఎకరాకు రూ.13.50 లక్షల చొప్పున మొత్తం రూ.24.30 కోట్లతో ప్రభుత్వం కొనుగోలు చేసిందని వివరించారు. రూ.24 కోట్ల కొనుగోలులో రూ.128 కోట్ల కుంభకోణం ఎలా జరిగిందో ఎమ్మెల్యే ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఈ వివరాలను ఎవరైనా ఆర్‌టీఐ ద్వారా పొందవచ్చని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి రైతుల వద్ద అక్రమ అగ్రిమెంట్లు చేసుకున్నారని ఆరోపిస్తున్న ఎమ్మెల్యే, ఒక్క రైతునైనా మీడియా ముందుకు తీసుకురాగలరా అని ప్రశ్నించారు. సొంత కూటమి నేతలే ఎమ్మెల్యేపై రూ.50 లక్షలు డిమాండ్ చేశారని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో, వాటిని మర్చిపోయేలా చేయడానికే ఎమ్మెల్యే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే అనుచరులు ఎస్కేడీ కాలనీలో దొంగ రిజిస్ట్రేషన్లు, భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, వాటిపై ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదని బి. దేవా ప్రశ్నించారు. “దొంగే దొంగ అన్నట్లు ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారు” అంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల తరువాత ఇంతకాలం గడిచినా ఆదోని అభివృద్ధికి ఎమ్మెల్యే ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నా, దొంగతనాలు, దోపిడీలు పెరుగుతున్నా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆదోనిని అభివృద్ధి చేసే సామర్థ్యం లేకపోతే ఎమ్మెల్యే వెంటనే రాజీనామా చేసి మళ్లీ ప్రజల్లోకి రావాలని బి. దేవా సవాల్ విసిరారు. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ఇకనైనా విమర్శలు మాని అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు.
Admin
DNB News