DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలో ఉన్న బీసీ హాస్టల్‌లో విద్యార్థులతో పనులు చేయిస్తున్న ఘటనపై డి.ఎస్.ఎఫ్ విద్యార్థి సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి, సంబంధిత వార్డెన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో డి.ఎస్.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్, రాష్ట్ర కార్యదర్శి బాలు మాట్లాడుతూ, విద్యార్థుల తల్లిదండ్రులు నమ్మకంతో హాస్టల్‌లో ఉంచి వలసలకు వెళ్తున్నారని, అయితే అక్కడ విద్యార్థులతో పనులు చేయించడం అత్యంత బాధాకరమని అన్నారు. “విద్యార్థుల చేత పనులు చేయించడం ఏమిటి?” అంటూ ప్రశ్నించారు. బీసీ సంక్షేమ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై కూడా వారు మండిపడ్డారు. ఇలాంటి సంఘటనలు అధికారుల దృష్టికి వెళ్లలేదా? లేదా పట్టించుకోవడం లేదా? అని ప్రశ్నించారు. ముఖ్యంగా బీసీ సంక్షేమ శాఖ అధికారి సబితమ్మ వెంటనే జోక్యం చేసుకుని పూర్తి స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, ఈ విషయంలో చర్యలు తీసుకోకపోతే డి.ఎస్.ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డి.ఎస్.ఎఫ్ నాయకులు హరి, మోహన్, విక్రమ్, రాజ్ కుమార్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News