DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని మండలాన్ని రెండు మండలాలుగా విభజించినప్పటికీ ప్రజలకు ఆశించిన స్థాయిలో ప్రయోజనం చేకూరడం లేదని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదోని మండలాన్ని విభజించాలని ప్రజల తరఫున డిమాండ్ చేసి సాధించిన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి అదే చొరవతో నూతన ఆదోని రెండో మండలానికి అన్ని శాఖల్లో పూర్తి స్థాయి అధికారుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు. ప్రస్తుతం రెండు మండలాలకు ఒకే తహసీల్దార్‌తో పాటు వివిధ శాఖల్లో ఒకే అధికారి ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తుండటంతో ప్రజా సమస్యల పరిష్కారం ఆలస్యమవుతోందని తెలిపారు. రైతులు, సాధారణ ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాల అమలు, రెవెన్యూ సంబంధిత పనులు సకాలంలో పూర్తికాక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. నూతన మండలం ఏర్పాటు వెనుక ఉన్న లక్ష్యం ప్రజలకు పరిపాలనా సౌలభ్యం కల్పించడమేనని, అయితే ప్రత్యేక అధికారులు మరియు కార్యాలయాలు లేకపోవడంతో ఆ లక్ష్యం నెరవేరడం లేదన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్లి, నూతన ఆదోని రెండో మండలానికి ప్రత్యేక అధికారుల నియామకం, కార్యాలయాల ఏర్పాటు కోసం తక్షణ చర్యలు చేపట్టేలా కృషి చేయాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరఫున విజ్ఞప్తి చేశారు.
Admin
DNB News