DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఎమ్మిగనూరు పట్టణంలోని పురాతన “కోతుల బావి” శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి చెందిన భూమి పరిరక్షణ, అభివృద్ధి అంశంపై విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. దేవాలయానికి చెందిన 33 సెంట్ల స్థలంలో భక్తులు ప్రతిష్ఠించిన శ్రీ గణేష్ మరియు హనుమంతుని విగ్రహాలను రెండు రోజుల క్రితం ఎమ్మిగనూరు మున్సిపల్ సిబ్బంది, పోలీసుల సహకారంతో, స్థానిక రాజకీయ నాయకుల అండతో ప్రజలు చూస్తుండగానే కూల్చివేసిన ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ చర్య హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని పేర్కొన్నారు. గత కొంతకాలంగా దేవాలయ భూమిని కబ్జా చేసి అక్రమంగా షాపులు ఏర్పాటు చేస్తున్నారని ఆరోపిస్తూ, దేవాలయ పవిత్రతను భంగం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేవాలయానికి చెందిన 33 సెంట్ల భూమి పూర్తిగా దేవాలయానికే చెందేలా చర్యలు తీసుకోవాలని, దేవాలయం ముందు ఉన్న స్థలాన్ని రహదారి అవసరాలకే వినియోగించాలన్నారు. రాష్ట్ర కమిటీ సూచన మేరకు రాష్ట్ర మరియు జిల్లా ప్రతినిధి బృందం ఎమ్మిగనూరుకు చేరుకుని మున్సిపల్ కార్యాలయం, డి.ఎస్.పి కార్యాలయం ముందు రామనామస్మరణతో నిరసన కార్యక్రమాలు నిర్వహించి అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. అనంతరం పురాతన కోతుల బావి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు, రాష్ట్ర మరియు జిల్లా నాయకులు పాల్గొన్నారు. దేవాలయ భూమిపై అక్రమాలు చేసిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, గతంలో అన్య మతస్తులకు షాపులు కేటాయించి డబ్బులు వసూలు చేసిన రాజకీయ నాయకులపై కూడా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే భక్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్న పోలీసు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అవసరమైతే న్యాయపరమైన పోరాటం కొనసాగిస్తామని, దేవాలయ గౌరవం కాపాడే వరకు ఉద్యమం ఆగదని విశ్వ హిందూ పరిషత్ – బజరంగ్ దళ్ నాయకులు స్పష్టం చేశారు.
Admin
DNB News