DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని నియోజకవర్గంలో గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న తగాదాలు, దాడుల ఘటనలపై మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి , కూటమి నాయకులు పరిపాలన మరియు పార్టీ కార్యకర్తలపై సమగ్ర పట్టు సాధించి సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఆదోని నియోజకవర్గం ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా వైసీపీ నుంచి బీజేపీలో చేరుతున్న కొందరు నాయకులు, పార్థసారధి విజయానికి కృషి చేసిన టీడీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి కూటమి పార్టీలతో కలిసి ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి గ్రామాల్లో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అలాగే పార్టీలో చేరే వ్యక్తులకు ముందుగా కూటమి పార్టీలతో సమన్వయం, శాంతియుత రాజకీయాలపై కౌన్సెలింగ్ ఇవ్వాలని కోరారు. ఆదోనిలో పెరుగుతున్న దాడుల సంస్కృతి గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు. ప్రజలు దాడులు, ప్రతిదాడులకు దూరంగా ఉండి శాంతియుత జీవనం సాగించాలని విజ్ఞప్తి చేశారు. భద్రతా సమస్యలు ఎదురైతే పోలీసులకు, ఉన్నతాధికారులకు, మీడియాకు ఫిర్యాదు చేసి చట్టబద్ధంగా న్యాయం పొందాలని సూచించారు. ప్రజాసంఘాల నాయకులుగా తాము కూడా ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దాడులు, ప్రతిదాడుల వల్ల కుటుంబాల భవిష్యత్తు అంధకారమవుతుందని, ప్రజలు రాజ్యాంగబద్ధంగా తమ హక్కులను సాధించుకోవాలని నూర్ అహ్మద్ పిలుపునిచ్చారు.
Admin
DNB News