DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి (MCH) రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించి మరోసారి తన ప్రతిభను చాటుకుంది. ప్రసవ సేవలు సమర్థవంతంగా నిర్వహించడం, నవజాత శిశువులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం వంటి అంశాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆసుపత్రికి ప్రశంసా పత్రాన్ని అందజేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రశంసా పత్రాన్ని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి తన క్యాంప్ కార్యాలయంలో మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి వైద్యులు, సిబ్బందికి అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ, ఆదోని మాతా శిశు ఆసుపత్రికి రాష్ట్రస్థాయిలో మొదటి స్థానం రావడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో సేవలు అందించి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మధుసూదన్ రెడ్డి, డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ బాలాజీ, డాక్టర్ భాగ్యలక్ష్మి, డాక్టర్ మమత, డాక్టర్ వసంతలక్ష్మి, డాక్టర్ విజయభారతి, డాక్టర్ రామచంద్రుడు, డాక్టర్ హేమకిరణ్, డాక్టర్ రంగస్వామి, డాక్టర్ మౌనిక, డాక్టర్ రాజేష్, డాక్టర్ శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News