DNB News - ఆంధ్రప్రదేశ్ / : అప్రమత్తతతో బాలిక భవిష్యత్తు కాపాడిన ఐసిడిఎస్ బృందం ఆదోని మండలం సుల్తాన్‌పురం గ్రామంలో జరగబోతున్న ఒక బాల్య వివాహాన్ని ఐసిడిఎస్ అధికారులు సమయోచితంగా అడ్డుకుని బాలిక భవిష్యత్తును కాపాడారు. అందిన గోప్య సమాచారం మేరకు వెంటనే స్పందించిన ఐసిడిఎస్ అధికారులు, సీడీపీఓ దిల్లేశ్వరి ఆదేశాల మేరకు సూపర్వైజర్ సావిత్రి సంఘటన స్థలానికి చేరుకున్నారు. బోయ కమలాక్షి-హనుమన్న దంపతుల కుమారుడు నాగేంద్ర (22) మరియు మంగంపేట గ్రామానికి చెందిన పెద్ద కాత్రిక నాగలక్ష్మి-అనుమప్ప దంపతుల కుమార్తె (16) మధ్య వివాహం బుధవారం సాయంత్రం 5:30 గంటలకు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో జరగాల్సి ఉండేది. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ సావిత్రి బాలిక కుటుంబ సభ్యులకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ, బాల్య వివాహం చట్ట విరుద్ధమని వివరించారు. భారతదేశంలో అమలులో ఉన్న "ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్-2006" ప్రకారం, 18 సంవత్సరాల లోపు అమ్మాయికి, 21 సంవత్సరాల లోపు అబ్బాయికి వివాహం జరపడం నేరమని తెలిపారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో కుటుంబ సభ్యులు వివాహాన్ని నిలిపివేశారు. అధికారులు బాలిక భవిష్యత్తు, విద్యపై దృష్టి పెట్టాలని సూచించారు. గ్రామ ప్రజలు కూడా బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు తెలిసిన వెంటనే 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ అధికారులు, వీఆర్వో, పోలీసులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. సమాజం సహకరిస్తేనే బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించగలమని అధికారులు తెలిపారు.
Admin
DNB News