DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలో పాత ట్రాఫిక్ సిగ్నల్స్ వినియోగంలో ఉండగానే కొత్త సిగ్నల్స్ ఏర్పాటు చేయడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎ. నూర్ అహ్మద్ ఆర్టీఐ ద్వారా వివరాలు కోరారు. సుమారు రూ.36 లక్షల వ్యయంతో కొత్త ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో, పాత సిగ్నల్స్ పనికిరావని ఎవరైనా నిపుణులు నివేదిక ఇచ్చారా? ఇచ్చినట్లయితే ఆ నివేదిక ప్రతిని అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రోజు ఆదోని పురపాలిక సంఘం కార్యాలయంలో సమాచార హక్కు చట్టం కింద దాఖలు చేసిన దరఖాస్తులో పలు కీలక ప్రశ్నలను లేవనెత్తారు. ప్రస్తుతం పాత ట్రాఫిక్ సిగ్నల్స్ ఎక్కడ ఉన్నాయో వివరాలు, కొత్త సిగ్నల్స్ కొనుగోలు రసీదుల ప్రతులు, టెండర్ ప్రక్రియ వివరాలు తదితర సమాచారాన్ని అందించాలని కోరారు. అదేవిధంగా పట్టణంలో అత్యంత రద్దీగా ఉండే శ్రీనివాస భవన్ సమీపంలో డివైడర్ తొలగించినప్పటికీ అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ప్రజల సౌకర్యం, రహదారి భద్రత దృష్ట్యా సరైన ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరేంద్ర యాదవ్ పాల్గొన్నారు. ప్రజా ధన వినియోగంలో పారదర్శకత ఉండాలని, ప్రతి రూపాయి ఖర్చుకు స్పష్టమైన లెక్కలు ఇవ్వాల్సిందేనని నూర్ స్పష్టం చేశారు
Admin
DNB News