DNB News - ఆంధ్రప్రదేశ్ / : నారాయణ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా 9వ తరగతి విద్యార్థి ప్రాణాపాయ స్థితిలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ AISA, PDSU, AISF, SFI, YSRSU, RPSF, బీసీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో స్కూల్ ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా AISA రాష్ట్ర కార్యదర్శి నాగార్జున, PDSU రాష్ట్ర నాయకులు రమణకుమార్, YSRSU రాష్ట్ర కార్యదర్శి కటారి కొండ సాయి, SFI జిల్లా అధ్యక్షుడు సాయి, AISF నగర అధ్యక్షుడు అశోక్, నగర కార్యదర్శి అభి, RPSF జిల్లా అధ్యక్షుడు నాగరాజు, బీసీ సంఘం నాయకులు రంగన్న, గిరీష్ మాట్లాడుతూ – తల్లిదండ్రుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న నారాయణ స్కూల్ యాజమాన్యం విద్యార్థుల భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైందని తీవ్రంగా విమర్శించారు. డోన్ మండల కేంద్రానికి చెందిన 9వ తరగతి విద్యార్థి రామ్ చరణ్ తేజ్ ఉల్చాల రోడ్డులో ఉన్న నారాయణ స్కూల్‌లో మూడు రోజుల క్రితం విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో అతని బీజాలపై తీవ్రంగా దాడి జరగడంతో పరిస్థితి విషమించి ఒక బీజాన్ని పూర్తిగా తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. దాడి జరిగిన వెంటనే విద్యార్థిని ఆసుపత్రికి తరలించకుండా స్కూల్ యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యం వహించడంతో అతని పరిస్థితి మరింత విషమించిందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. విద్యార్థుల పట్ల బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న నారాయణ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని, నిర్లక్ష్యం వహించిన హాస్టల్ వార్డెన్, ప్రిన్సిపల్, ఏజీఎం పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బాధిత విద్యార్థికి అన్ని విధాలుగా మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. పర్మిషన్ లేకుండా స్కూల్ ప్రాంగణంలోనే బాయ్స్, గర్ల్స్ హాస్టల్స్‌ను ఒకే ప్రాంగణంలో నిర్వహిస్తున్నారని, దీనిపై విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి హాస్టల్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రామ్, వీరేష్, సునీల్, కిరణ్, రాజా, సూర్య, వాసు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News