DNB News - ఆంధ్రప్రదేశ్ / : మా ప్రాణాలైనా ఇస్తాం కానీ.. సాగు భూములను వదులుకోం - ఐటి పార్క్, డేటా సెంటర్ భూసేకరణపై భోగాపురం మండలం ముంజేరు రైతుల. భోగాపురం/విజయనగరం: ప్యాకేజీలు వద్దు.. మా భూములే మాకు ముద్దు జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు రైతులు విన్నపం. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముంజేరు గ్రామంలో ప్రభుత్వం ప్రతిపాదించిన ఐటి పార్క్ మరియు డేటా సెంటర్ నిర్మాణాల కోసం సాగు భూములను సేకరించాలనే నిర్ణయాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం నాడు విజయనగరం జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్, వైయస్సార్ సిపి జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావుని ధర్మపురి, తన క్యాంప్ కార్యాలయం నందు కలిసిన ముంజేరు గ్రామ రైతులు తమ గోడును వెళ్లబోసుకుంటూ వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా రైతులు తమ వాదనను ఈ విధంగా వినిపించారు: వ్యవసాయమే మా జీవనాధారం: వందల సంవత్సరాలుగా వ్యవసాయాన్ని నమ్ముకుని జీవిస్తున్నామని, మా భూముల్లో ఏడాదికి మూడు, నాలుగు పంటలు పండుతాయని రైతులు తెలిపారు. వరి, చెరుకు, వేరుశనగ, కొబ్బరి, సరుగుడు వంటి పంటలతో దేశవ్యాప్తంగా ఎగుమతులు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నామని పేర్కొన్నారు. గతంలోనే త్యాగం చేశాం:ఇప్పటికే అభివృద్ధి కోసం ప్రభుత్వం అడిగిన వెంటనే భోగాపురం విమానాశ్రయం కోసం సుమారు 3 వేల ఎకరాల భూమిని ఇచ్చామని, ఇప్పుడు మిగిలి ఉన్న కొద్దిపాటి సారవంతమైన భూములను కూడా లాక్కోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్యాకేజీలు వద్దు - భూమే ముద్దు: ఎన్ని కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చినా, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎంత ఆశ చూపినా తాము భూములను విక్రయించలేదని, తమకు వ్యవసాయం తప్ప మరే పని తెలియదని రైతులు స్పష్టం చేశారు. ఉపాధి ఎక్కడ?: గతంలో భూములు సేకరించిన ప్రాంతాల్లో ఇప్పటికీ ఎటువంటి నిర్మాణాలు జరగలేదని, స్థానిక రైతులకు ఎటువంటి ఉపాధి కల్పించలేదని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ప్రభుత్వానికి హెచ్చరిక: "మా ప్రాణాలు తీసి అయినా సరే భూసేకరణ చేసుకోవాలి తప్ప, మేము భూములను ఇచ్చే ప్రసక్తే లేదు" అని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ముంజేరు గ్రామ భూసేకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని, ఐటి పార్క్ ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి,సర్పంచు పూడి నూకరాజు, పిడుగు సత్యనారాయణ, పిడుగు వెంకట సత్యం, ఎంపీటీసీ వెంకట సత్యం, పిడుగు తోట రావు, జక్కంపూడి రాంబాబు, పిడుగు తౌడు ఇతర గ్రామ రైతులు, పెద్దలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
Admin
DNB News