DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలోని షాహీ జామియా మస్జిద్ ఆస్తులు, ఆదాయం మరియు నిర్వహణలో జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్న అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ బీజేపీ మైనారిటీ నాయకులు సబ్-కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆదోనికి చెందిన బి. జాఫర్ మాట్లాడుతూ, సుమారు 400 సంవత్సరాల చరిత్ర కలిగిన షాహీ జామియా మస్జిద్‌కు దాదాపు ₹1000 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నప్పటికీ, వాటి నిర్వహణలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని తెలిపారు. మస్జిద్ ఆస్తులు ఒకే వ్యక్తి ఆధీనంలో ఉండటం, వాటిలో కొంత భాగం బంధువుల పేర్లకు మార్చబడినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. గత 10 సంవత్సరాలుగా ఆస్తుల వివరాలు, ఆదాయం-వ్యయాల సమాచారం ప్రజలకు వెల్లడించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మస్జిద్‌కు వచ్చే ఆదాయంలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయని, అధికారిక రశీదుల్లో తక్కువ మొత్తమే చూపిస్తూ మిగిలిన మొత్తాన్ని వ్యక్తిగత ఖాతాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. అలాగే, ప్రతి ఐదు సంవత్సరాలకు జరగాల్సిన కమిటీ ఎన్నికలను ఆలస్యం చేస్తూ అదే వ్యక్తి పదవిలో కొనసాగుతున్నారని పేర్కొన్నారు. ఈ అంశాలపై ప్రశ్నించిన వారిని బెదిరింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయని తెలిపారు. ప్రజల డిమాండ్లు: మస్జిద్ ఆస్తుల పూర్తి వివరాలను వెంటనే ప్రజలకు వెల్లడించాలి అక్రమంగా బదిలీ చేసిన ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకోవాలి మస్జిద్ ఆదాయాన్ని ప్రతి నెల ప్రజలకు తెలియజేయడానికి డిస్‌ప్లే బోర్డ్ ఏర్పాటు చేయాలి కనీసం 10 మంది సభ్యులతో రక్షణ కమిటీ ఏర్పాటు చేయాలి మస్జిద్ కమిటీ ఎన్నికలను తక్షణమే నిర్వహించాలి ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, మస్జిద్ పవిత్రతను కాపాడాలని వారు అధికారులను కోరారు.
Admin
DNB News