DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని జిల్లా సాధన కోసం కొనసాగుతున్న ఉద్యమం రోజురోజుకు ఉధృతమవుతోంది. 127వ రోజు రిలే నిరాహార దీక్షలో భాగంగా పగడాల కోదండ కుటుంబ సమేతంగా దీక్షలో కూర్చోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా బీడీఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకుడు పగడాల రమేష్ మాట్లాడుతూ – గతంలో కుటుంబ సమేతంగా దీక్షలో కూర్చుంటామని చెప్పిన నాయకులు ఇప్పుడు కనిపించకపోవడం బాధాకరమని విమర్శించారు. కర్నూలు పశ్చిమ ప్రాంతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అధిక జనాభా ఉన్న ప్రాంతం అయినప్పటికీ అభివృద్ధిలో వెనుకబడి ఉందని, ప్రజల ఆశయమే ఆదోని జిల్లా సాధన అని తెలిపారు. 127వ రోజు దీక్షకు సంఘీభావం తెలపడానికి ఆదోని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్, సిపిఐ నాయకుడు వీరేష్, బీజేపీ నాయకులు రమేష్ యాదవ్, పగడాల కిరణ్, విద్యార్థి నాయకుడు నాగరాజ్, ఎమ్మార్పీఎస్ నాయకుడు బండారి హనుమంతు, దాసరి నరేష్ తదితరులు హాజరై తమ మద్దతు తెలిపారు. ఆదోని జిల్లా ప్రకటించే వరకు పోరాటాన్ని కొనసాగించాలని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. ఇప్పటికే పట్టణ బంద్‌లు, ఐదు నియోజకవర్గాల బంద్‌లు, వంటవార్పు, పాదయాత్రలు, బైక్ యాత్రలు, నాయకుల ఇళ్ల ముట్టడులు నిర్వహించినప్పటికీ అధికార, ప్రతిపక్ష పార్టీలలో ఎలాంటి స్పందన లేకపోవడం తీవ్ర ఆవేదనకు గురిచేస్తోందన్నారు. ప్రజల ఓట్లతో పదవులు పొందిన నాయకులు, ప్రజలకు అవసరమైన నీరు, వైద్యం, విద్య, ఉపాధి, రవాణా వంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఇప్పటికైనా రాజకీయ నాయకులు మేలుకొని ఆదోని జిల్లా ఉద్యమానికి మద్దతు తెలపాలని డిమాండ్ చేశారు. ఈరోజు దీక్షలో పగడాల కోదండతో పాటు పగడాల జానకమ్మ, అనిల్ కుమార్, శైలజమ్మ, మమత, భాగ్యశ్రీ, సాయి పల్లవి, అనిత్య, ఈశా తదితర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా సుభాష్ చంద్రబోస్, రామాంజనేయులు, వైపీ నాగరాజు, సుగుణమ్మ, గోవిందరాజులు, హైకోర్టు న్యాయవాది బి. రామాంజనేయులు, బీఎస్పీ నాయకుడు రామలింగయ్య, గుమ్మాల బాలస్వామి, జగన్, నరేష్ యాదవ్, దాసరి నరేష్ తదితరులు పాల్గొని దీక్షను విజయవంతం చేశారు. చివరిగా పగడాల కోదండ, పగడాల రమేష్ మాట్లాడుతూ – ఆదోని జిల్లా సాధనమే తమ అంతిమ లక్ష్యమని, ఆ లక్ష్యం సాధించే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
Admin
DNB News