DNB News - ఆంధ్రప్రదేశ్ / : జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను పోలీసులు ముమ్మరం చేసినట్లు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికే ఈ ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నామని ఆయన శుక్రవారం వెల్లడించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు పలు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారని చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లే ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించిన నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి: జనవరి నెలలో – 806 కేసులు ఫిబ్రవరి నెలలో – 573 కేసులు మార్చి (12వ తేదీ వరకు) – 287 కేసులు మొత్తంగా గత రెండున్నర నెలల్లో 1,666 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు పలు సూచనలు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగించవద్దని, సురక్షిత ప్రయాణం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపకుండా ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ కోరారు.
Admin
DNB News