DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని మండలంలోని స్థానిక మార్కెట్ యార్డ్‌లో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని సిపిఐ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం సీనియర్ నాయకులు కే. లక్ష్మిరెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సుదర్శన్, సిపిఐ ఆదోని మండల కార్యదర్శి కల్లుబావి రాజు తదితరులు మాట్లాడుతూ – ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని పెద్ద ఎత్తున చేసిన పోరాటాల ఫలితంగానే ప్రభుత్వం కందుల కొనుగోలు కేంద్రాలకు అనుమతి ఇచ్చిందన్నారు. ఆదోని మండల రైతులు పండించిన కంది పంట మొత్తాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కేడీసీఎంఎస్ అధికారులకు అనుమతి ఇవ్వడం హర్షణీయమన్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్ యార్డ్‌లో అధికారులు నాణ్యత పేరుతో తాలు, తబకలు, పుచ్చు వంటి కారణాలు చూపుతూ రైతుల పంటను తిరస్కరిస్తూ అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అతివృష్టి, అనావృష్టి మధ్య ఆరుకాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు వచ్చిన రైతులను వేధించడం అన్యాయమన్నారు. ప్రభుత్వం రైతులకు ఒక మాట, అధికారులకు మరో మాట చెప్పడం చంద్రబాబు ప్రభుత్వానికి అలవాటైందని విమర్శించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే భవిష్యత్తులో కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. నాణ్యత పేరుతో కందుల కొనుగోలు నిలిపివేస్తే కొనుగోలు కేంద్రం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని తెలిపారు.
Admin
DNB News