DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆముదాలవలస పట్టణంలో పవిత్ర తిరుమలలో శ్రీవారి లడ్డూ కల్తీ జరిగిందన్న ఆరోపణలపై సిట్ రిపోర్ట్ కల్తీ జరిగింది అని నిర్ధారించినప్పటికీ క్షమాపణ చెప్పని గత వైసీపీ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఆమదాలవలస నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆముదాలవలస గౌరవ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియుసి చైర్మన్ శ్రీ కూన రవికుమార్ హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ, కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక అయిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రసాదంగా అందించే లడ్డూపై కల్తీ ఆరోపణలు రావడం అత్యంత బాధాకరమని అన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా గత వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శించారు. శ్రీవారి ప్రసాదం పవిత్రతను కాపాడటం ప్రభుత్వాల బాధ్యత అని, అలాంటి అంశాల్లో నిర్లక్ష్యం చోటుచేసుకోవడం క్షమించరాని నేరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ విషయంలో పూర్తి స్థాయి విచారణ జరిపి సిట్ రిపోర్ట్ ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పేడాడ రామ్మోహన్ రావు మాట్లాడుతూ, భక్తుల ఆవేదనకు ప్రతీకగా ఈ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టామని తెలిపారు. శ్రీవారి మహిమకు మచ్చ తెచ్చే ప్రయత్నాలను జనసేన పార్టీ ఎట్టి పరిస్థితుల్లో సహించదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు మొదలవలస రమేష్ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీక్షకు మద్దతు తెలిపారు.
Admin
DNB News