DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా హోళగుంద మండలం ముద్దటమాగి గ్రామ పంచాయతీలోని బీరప్ప దేవాలయం ప్రాంగణంలో రాయలసీమ ప్రగతిశీల లోడింగ్ అన్‌లోడింగ్ హమాలీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టియు అనుబంధం) ఆధ్వర్యంలో హమాలీ కార్మికుల జనరల్ బాడీ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఐఎఫ్టియు జిల్లా కమిటీ సభ్యులు నరసన్న అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యులు బి.సురేష్, సిపిఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి మల్లికార్జున, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి జి.వెంకప్ప, ప్రగతిశీల మహిళా సంఘం (పిఓడబ్ల్యూ) జిల్లా కార్యదర్శి మణి పాల్గొని మాట్లాడారు. వక్తలు మాట్లాడుతూ అసంఘటిత కార్మిక రంగంలో హమాలీలు జాతి సంపద సృష్టిలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వారి సంక్షేమం, జీవన భద్రత కోసం తగిన చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. హమాలీల కుటుంబాలు వారి శారీరక శ్రమపైనే ఆధారపడి జీవిస్తున్నప్పటికీ, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పలు ప్రాంతాల్లో కార్మిక చట్టాలు అమలు కాకపోవడం, యాజమాన్యాలు సరైన వేతనాలు చెల్లించకపోవడం వల్ల హమాలీలు తీవ్ర శ్రమదోపిడీకి గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల కారణంగా హమాలీ కార్మికుల కుటుంబాలు ఆర్థికంగా దుర్భర స్థితిలో ఉన్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకుని అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా హమాలీ కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, పీఎఫ్, ఈఎస్ఐ, ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించాలని కోరారు. 60 సంవత్సరాలు పూర్తయిన హమాలీ కార్మికులకు నెలకు రూ.10 వేల పింఛన్, విధి నిర్వహణలో లేదా ఇతర కారణాలతో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హోలగుంద మండల ఐఎఫ్టియు కార్యదర్శి సౌరప్ప, కమిటీ సభ్యులు దేవన్న, బసప్ప, ఈరన్న, మల్లప్ప తదితరులు పాల్గొన్నారు. జి. వెంకప్ప జిల్లా కార్యదర్శి, భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్టియు)
Admin
DNB News