DNB News - ఆంధ్రప్రదేశ్ / : అంగన్వాడి వర్కర్స్ యూనియన్ CITU ఆధ్వర్యంలో మున్సిపల్ గ్రౌండ్ నుండి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బీమా సర్కిల్ వద్ద రాస్తారోకో చేపట్టి, టూ టౌన్ సీఐ కి అరెస్టు చేసిన అంగన్వాడీ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే. వెంకటమ్మ, రిజ్వానా సర్వోజమ్మతో పాటు CITU అధ్యక్షులు, కార్యదర్శులు పి.ఎస్. గోపాల్, జె. రామాంజనేయులు, తిప్పన్నా వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ, ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం తెలంగాణ కంటే అధిక వేతనాలు ఇస్తామని హామీ ఇచ్చిందని, కానీ రెండు సంవత్సరాలు గడిచినా ఆ హామీ అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనేకసార్లు ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలను తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో మార్చి 2న "చలో విజయవాడ" మహాధర్నాకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. అయితే సమస్యలు పరిష్కరించకుండా అక్రమ అరెస్టులు చేసి నిర్బంధించడం దారుణమని ఖండించారు. అంగన్వాడీలకు కనీస వేతనం నెలకు రూ. 26,000గా వెంటనే పెంచాలని, సంక్షేమ పథకాలను అమలు చేయాలని, ఈపీఎఫ్ మరియు ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని, అదనపు ప్రభుత్వ యాప్స్‌ను రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ నాయకులు రిజ్వానా, లలిత, కరుణ, విజయలక్ష్మి, వెంకటలక్ష్మి, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News