DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా అవుట్ సోర్సింగ్ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుండి భారీగా డబ్బులు వసూలు చేసిన వ్యక్తిని కర్నూలు 2 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని కర్నూలు డీఎస్పీ జె. బాబు ప్రసాద్ తెలిపారు. కర్నూలు 2 టౌన్ పి.ఎస్ క్రైమ్ నంబరు 31/2026, U/sec 318(4), 336(3), 340(2) BNS మరియు 66 ఐటీ యాక్ట్ ప్రకారం 07-02-2026న కేసు నమోదు చేయబడింది. అరెస్టైన నిందితుడు ఊటూపల్లి మహేంద్ర బాబు @ మహేంద్ర (38), స్వగ్రామం చిత్తూరు జిల్లా కొత్తపల్లి. ప్రస్తుతం తిరుపతి టౌన్‌లో నివసిస్తున్నాడు. గతంలో పత్రికల యాడ్ విభాగంలో పనిచేసిన అనుభవాన్ని ఉపయోగించుకుని, ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి ఒక్కో ఉద్యోగానికి రూ.1 లక్ష నుండి రూ.1.50 లక్షల వరకు వసూలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. కొందరికి నకిలీ నియామక ఉత్తర్వులు పంపినట్లు పోలీసులు తెలిపారు. అలాగే 2024లో ఒక వ్యక్తికి “M/s Tvaste Infra Projects Pvt Ltd”లో పెట్టుబడి పెడితే సెల్ టవర్స్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని చెప్పి సుమారు రూ.2 కోట్ల వరకు మోసం చేసిన కేసు కూడా తిరుపతిలో నమోదైనట్లు సమాచారం. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు పొందలేమని, దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ సూచించారు
Admin
DNB News