DNB News - ఆంధ్రప్రదేశ్ / : నాలుగు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలనే డిమాండ్‌తో కొనసాగుతున్న నిరంతర పోరాటంలో భాగంగా, 2026 ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని IFTU (ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్లు) పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా IFTU కార్మికుల ఆధ్వర్యంలో సమ్మె వాల్ పోస్టర్లను విడుదల చేయడం జరిగింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి IFTU జిల్లా కార్యదర్శి వెంకటప్ప మాట్లాడుతూ, పారిశ్రామిక విప్లవం నాటి నుంచి కార్మిక వర్గం 8 గంటల పని దినం వంటి హక్కులను సాధించేందుకు ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసిందని గుర్తుచేశారు. జైలు జీవితాలు, నిర్బంధాలు, ఉరికంబాలు ఎక్కిన చరిత్ర కార్మిక ఉద్యమానికి ఉందన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న కార్మిక చట్టాలు ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలతో వచ్చినవి కావని, కార్మిక వర్గం చేసిన దీర్ఘకాలిక, అలుపెరుగని పోరాటాల ఫలితమని ఆయన స్పష్టం చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తన పార్లమెంటరీ బలంతో నాలుగు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను ఆమోదించిందని, కరోనా లాక్‌డౌన్ సమయంలో మూడు కోడ్లను ఆమోదించడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. గత ఆరు సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతుండటంతో అవి అమల్లోకి రాలేదని, అయితే 2025 నవంబర్ 21న కేంద్ర ప్రభుత్వం మరో వారంలోనే నాలుగు లేబర్ కోడ్లను అమలు చేస్తామని ప్రకటించిందన్నారు. నవంబర్ 26న దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల నేపథ్యంలో, 2026 ఏప్రిల్ నుంచి ఈ కోడ్లను అమల్లోకి తేనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండించారు. కార్మికుల హక్కులు, భద్రత, జీవనోపాధిని కాపాడుకోవాలంటే ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను సమష్టిగా విజయవంతం చేయాలని వెంకటప్ప పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొట్టాల మల్లికార్జున, శ్రీరాములు, ఖాదర్, బాబు, రూబెన్ తదితరులు పాల్గొన్నారు
Admin
DNB News