DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ కర్నూలు జిల్లా వ్యాప్తంగా డ్రోన్ పెట్రోలింగ్ ప్రారంభించనున్నట్లు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ (డీజీపీ కార్యాలయం) నుండి జిల్లా పోలీస్ శాఖకు కేటాయించిన మూడు నూతన డ్రోన్ కెమెరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆవిష్కరించారు. డే విజన్, నైట్ విజన్ సదుపాయాలు కలిగిన ఈ డ్రోన్ కెమెరాల ద్వారా పగలు, రాత్రి నిరంతర నిఘా నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని కళాశాలలు, పాఠశాలల వద్ద డ్రోన్ కెమెరాలతో గట్టి నిఘా ఉంచి ఆకతాయిలను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. శక్తి టీమ్ బృందాలతో కలిసి కళాశాలలు, పాఠశాలల వద్ద ఈవ్ టీజింగ్‌కు పాల్పడే వారిని గుర్తించడంతో పాటు బహిరంగ మద్యపానం, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు డ్రోన్ల వినియోగం కీలకంగా ఉంటుందని తెలిపారు. డ్రోన్ల ద్వారా నేరాల నియంత్రణ, చోరీల నివారణ, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన పర్యవేక్షణ సాధ్యమవుతుందని అన్నారు. సిబ్బంది కొరత ఉన్న ప్రాంతాల్లో కూడా ఈ డ్రోన్ కెమెరాల ద్వారా సమర్థవంతమైన నిఘా నిర్వహించేందుకు వీలుంటుందని తెలిపారు. ఉత్సవాలు, పండుగలు, వేడుకలు, ట్రాఫిక్ నియంత్రణతో పాటు భారీగా ప్రజలు తరలివచ్చే సందర్భాల్లో శాంతిభద్రతలను కాపాడేందుకు ఈ సాంకేతికత మరింత దోహదపడుతుందని చెప్పారు. ప్రజల భద్రతే లక్ష్యంగా స్మార్ట్ పోలీసింగ్ దిశగా జిల్లా పోలీస్ శాఖ ముందడుగు వేస్తోందని, సీసీ కెమెరాల వినియోగంతో పాటు డ్రోన్ టెక్నాలజీని సమర్థవంతంగా అమలు చేస్తూ జిల్లాలో ప్రశాంత వాతావరణం కొనసాగేందుకు గట్టి చర్యలు చేపడతామని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సీఐ మధుసుధన్ రావు, సైబర్ ల్యాబ్ సీఐ మస్తాన్ వలి, ఆర్‌ఐ నారాయణ, సైబర్ ల్యాబ్ టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
DNB News