DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని మండలం పాండవగల్లు గ్రామంలో సర్వే నంబర్ 135లో ఉన్న 20 ఎకరాలకు పైగా విస్తరించిన పెద్ద చెరువు కేసు విషయంలో రెవెన్యూ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని సీపీఎం నాయకులు విమర్శించారు. ఈ సమస్యపై తక్షణమే కోర్టులో జోక్యం చేసుకుని కేసును పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే. వెంకటేశులు, మండల కార్యదర్శి కే. లింగన్న ఆధ్వర్యంలో నాయకులు ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టి, సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సబ్ కోర్టు మరియు జిల్లా స్థాయి కోర్టులు ఈ చెరువును ప్రభుత్వ చెరువుగా గుర్తిస్తూ ఇప్పటికే తీర్పులు ఇచ్చినప్పటికీ, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇప్పటివరకు స్వాధీనం చేసుకోలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆక్రమణదారు 2013లో హైకోర్టును ఆశ్రయించడంతో కేసు పెండింగ్‌లో ఉందన్నారు. రెవెన్యూ అధికారులు సకాలంలో చర్యలు తీసుకోకపోవడం వల్ల 2023 ఆగస్టు తర్వాత కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఈ పరిస్థితికి అధికారుల నిర్లక్ష్య వైఖరే కారణమని ఆరోపించారు. కావున ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే జోక్యం చేసుకుని పాండవగల్లు పెద్ద చెరువు కేసును పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గ్రామస్తులతో కలిసి భారీ స్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు జే. రామాంజనేయులు, గోవిందు, అనీఫ్ బాషా, హనుమంత్ రెడ్డి, నాగరాజు, అలాగే గ్రామ రైతులు రామాంజనేయ, పకీరయ్య, దేవయ్య, శుభం కుమార్ స్వామి, నరసప్ప, కుప్పయ్య భోజరాజు తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News