DNB News - ఆంధ్రప్రదేశ్ / : ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ పట్టణంలో ఫ్లెక్సీలు, హోర్డింగ్ బోర్డులు ఏర్పాటు చేసి తప్పుడు ప్రచారాలు నిర్వహిస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల అక్రమ దోపిడిని అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ పట్టణ సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ నహీమ్ అహ్మద్ ని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యస్. షాబీర్ భాష మాట్లాడుతూ, ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.1కు విరుద్ధంగా అనుమతులు లేకుండానే విద్యాసంస్థలు తమ ర్యాంకుల ప్రచారాలు చేస్తూ పట్టణంలో భారీ ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. ముందస్తు అడ్మిషన్ల పేరుతో విద్యార్థులు, తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకువస్తూ భారీగా ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా మారుస్తున్నారని విమర్శించారు. కొన్ని విద్యాసంస్థలు ప్రభుత్వ గుర్తింపు లేకుండానే అడ్మిషన్లు నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టివేస్తున్నాయని తెలిపారు. వీఆర్వోలను కూడా విద్యార్థుల ఇళ్లకు పంపిస్తూ అడ్మిషన్ల కోసం ఒత్తిడి తెస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ లోపం వల్లే ఈ అక్రమాలు పెరిగాయని, ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల ఎదుట ఆందోళనలు చేపట్టి ఫ్లెక్సీలను స్వయంగా తొలగిస్తామని హెచ్చరించారు. మున్సిపల్ కమిషనర్ నహీమ్ అహ్మద్ స్పందిస్తూ పట్టణంలో ఉన్న అక్రమ ఫ్లెక్సీలను రెండు రోజులలోపు తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్, కోశాధికారి శేఖర్ తదితర నాయకులు పాల్గొన్నారు.
Admin
DNB News