DNB News - ఆంధ్రప్రదేశ్ / : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం కర్నూలులో భారీ ర్యాలీ, మహాధర్నా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన "వెన్నుపోటుకు రెండేళ్లు" నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. వైఎస్సార్‌సీపీ కర్నూలు నియోజకవర్గ ఇంచార్జ్, జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువజన ప్రతినిధులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆర్ఎస్ రోడ్డు నుంచి ప్రారంభమైన ర్యాలీ జిల్లా పరిషత్ సమీపంలోని మహాత్మా గాంధీ విగ్రహం వరకు కొనసాగగా, అనంతరం అక్కడ మహాధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త బుట్టా రేణుక మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. మహిళలకు నెలకు రూ.1,500 ఆర్థిక సాయం, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం, విద్యార్థులకు ఆర్థిక భరోసా, నిరుద్యోగ యువతకు భృతి, రైతులకు వార్షిక ఆర్థిక సహాయం వంటి హామీలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిపై కేసులు నమోదు చేసి భయపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన ఆమె, ప్రజల తరఫున ప్రశ్నించడం నేరం కాదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, ఎన్నికల హామీల అమలు, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మహిళలు, రైతులు, యువత, విద్యార్థులు, కార్మికులు తీవ్ర నిరాశలో ఉన్నారని పేర్కొన్న బుట్టా రేణుక, ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఈ ప్రభుత్వానికి భవిష్యత్తులో ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ విజయ మనోహరి, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
DNB News