DNB News - ఆంధ్రప్రదేశ్ / : DSF ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆదోని డివిజన్‌లో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రెస్ మీట్‌ను ఉద్దేశించి DSF రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్, రాష్ట్ర కార్యదర్శి బాలు మాట్లాడుతూ, ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ మార్గదర్శకాలను తుంగలో తొక్కుతూ ఇష్టానుసారంగా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా విద్యా శాఖ అధికారులు నిద్రమత్తులో ఉన్నారా? లేక కేవలం కుర్చీలకే పరిమితమయ్యారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి అక్రమాలు కొనసాగితే DSF విద్యార్థి సంఘంగా అడ్డుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే సంబంధిత విద్యాసంస్థల వద్దకే వెళ్లి నిరసనలు చేపట్టి, ఉన్నతాధికారులకు పరిస్థితులను వివరించనున్నట్లు తెలిపారు. అక్రమాలకు పాల్పడుతున్న విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా అమలు చేసి జిల్లా విద్యాశాఖ అధికారులు చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తుందని DSF విద్యార్థి సంఘం హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో హరి, నరసింహ, క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News