DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఎమ్మిగనూరు పట్టణంలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ ముందస్తు అడ్మిషన్లు, అక్రమ ప్రచారాలతో విద్యార్థులు మరియు తల్లిదండ్రులను తీవ్రంగా దోచుకుంటున్నాయని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి యస్ షాబీర్ భాష తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ పట్టణ అధ్యక్షుడు గపూర్ అధ్యక్షతన పట్టణ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన యస్ షాబీర్ భాష మాట్లాడుతూ, ప్రభుత్వ జీవో నెంబర్-1కు వ్యతిరేకంగా పట్టణంలోని అనేక ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు భారీ ఫ్లెక్సీలు, హోర్డింగ్ బోర్డులు ఏర్పాటు చేసి తప్పుడు ప్రచారాలతో విద్యార్థులను ఆకర్షిస్తూ ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రచారాలు నిర్వహించరాదనే నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని పూర్తిగా ఉల్లంఘిస్తూ ర్యాంకుల పేరుతో మోసపూరిత ప్రకటనలు ఇస్తూ తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని విమర్శించారు. అడ్మిషన్ల పేరుతో లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని విద్యాసంస్థలు ప్రభుత్వం నుంచి గుర్తింపు లేకుండానే అడ్మిషన్లు నిర్వహిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాయని అన్నారు. ప్రధాన కూడళ్లలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు పిఆర్వోలను విద్యార్థుల ఇండ్లకు పంపించి అడ్మిషన్ల కోసం ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రైవేట్ విద్యాసంస్థల అక్రమాలకు అండగా నిలుస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని యస్ షాబీర్ భాష ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ గుర్తింపు లేకుండా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న విద్యాసంస్థలపై తక్షణమే చర్యలు తీసుకుని, అవసరమైతే వాటిని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆయా విద్యాసంస్థల ఎదుట ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు హాజీ, శివ, వీరేష్, చరణ్, గౌతమ్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News