DNB News - ఆంధ్రప్రదేశ్ / : మహిళలపై జరుగుతున్న నేరాల నివారణ, మహిళల రక్షణ మరియు సైబర్ నేరాలపై అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ఎమ్మిగనూరు పట్టణంలోని వెంకటాపురం కాలనీలో శ్రీ గుంటెప్ప స్వామి దేవాలయం సమీపంలో బుధవారం “మీ రక్షణ - మా బాధ్యత” పేరుతో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని అన్నారు. మహిళలు ఎటువంటి వేధింపులు, సమస్యలు ఎదుర్కొన్నా భయపడకుండా పోలీసులను సంప్రదించాలని సూచించారు. చట్టాలపై అవగాహన పెరిగితేనే నేరాలు తగ్గుతాయని పేర్కొన్నారు. పోక్సో చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, నిర్భయ చట్టం వంటి పలు చట్టాలు మహిళల రక్షణ కోసం అమల్లో ఉన్నాయని తెలిపారు. పని ప్రదేశాల్లో లేదా సమాజంలో మహిళలపై అఘాయిత్యాలు జరిగినప్పుడు వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు. మహిళల భద్రత కోసం అందుబాటులో ఉన్న “శక్తి యాప్”ను మహిళలు వినియోగించుకోవాలని సూచించిన ఎస్పీ, అత్యవసర పరిస్థితుల్లో 112, 100, 181, 1098, 1930 హెల్ప్‌లైన్ నంబర్లను వినియోగించాలని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని చెప్పారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బి.వి. జయనాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళల భద్రతకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందన్నారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, సమస్యలుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. బాల్య వివాహాలు చేయరాదని తెలిపారు. ఎమ్మిగనూరు డీఎస్పీ శ్రీమతి భార్గవి మాట్లాడుతూ మహిళలు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, సైబర్ నేరాలు, ఈవ్ టీజింగ్ వంటి అంశాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళలపై వేధింపులు లేదా బాల్య వివాహాల సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు మున్సిపల్ కమిషనర్ కె. గంగి రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎమ్మిగనూరు రూరల్ సీఐ చిరంజీవి, బీజేపీ అసెంబ్లీ కో-కన్వీనర్ నరసింహులు, టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ మహేష్, ఎస్సైలు, గ్రామ మరియు వార్డు సచివాలయ మహిళా పోలీసులు, పోదుపు సంఘాల మహిళలు, స్థానిక మహిళలు పాల్గొన్నారు.
Admin
DNB News