DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలో దాదాపు 50 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈఎస్ఐ హాస్పిటల్‌ను ఇక్కడే యథావిధిగా కొనసాగిస్తూ, లబ్ధిదారులకు మెరుగైన వైద్యం అందించాలని సిఐటియు పట్టణ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సంబంధిత కార్పొరేషన్ అధికారులకు మరియు ఎమ్మెల్సీ బీటీ నాయుడు కి వినతిపత్రం సమర్పించారు. గతంలో రాయలసీమ ప్రాంతం నలుమూలల నుంచి కార్మికులు ఆదోనిలోని ఈఎస్ఐ హాస్పిటల్‌కు వచ్చి చికిత్స పొందేవారని తెలిపారు. అయితే, స్పిన్నింగ్ మిల్లులు మూతపడటం వల్ల కార్మికుల సంఖ్య తగ్గిందనే కారణంతో ప్రస్తుతం ఈ ఆసుపత్రిని కేవలం 10 పడకల ఆసుపత్రిగా పరిమితం చేయడం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సిఐటియు నాయకులు తిప్పన్న, పీఎస్ గోపాల్, లక్ష్మన్న, అజీం ఖాన్ మాట్లాడుతూ, ఆదోనిలో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు, మున్సిపాలిటీ, షాపింగ్ మాల్స్ వంటి అనేక రంగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు ఈఎస్ఐ వర్తిస్తోందని తెలిపారు. ప్రస్తుతం లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. కావున, ప్రస్తుతం ఉన్న 10 పడకల ఆసుపత్రిని మరింత బలోపేతం చేసి, అవసరమైన డాక్టర్లను నియమించి, నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కోరారు. అలాగే ఈఎస్ఐ హాస్పిటల్‌ను కర్నూలుకు తరలించే ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే లబ్ధిదారులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సిఐటియు నాయకులు హెచ్చరించారు.
Admin
DNB News