DNB News - ఆంధ్రప్రదేశ్ / : హత్య కేసులో ముద్దాయి దేవదాసుకు జీవిత ఖైదు విధిస్తూ ఆదోని రెండవ అదనపు జిల్లా జడ్జి P.J. సుధా తీర్పు వెలువరించారు. గోనెగండ్ల మండలం B. అగ్రహారం గ్రామానికి చెందిన హరిజన హంద్రీ దేవదాసు (37) గోనెగండ్ల మండలం బైలుప్పల గ్రామానికి చెందిన హరిజన లక్ష్మి (37)తో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఉండేవాడు. అనంతరం ఆమెపై అనుమానం పెంచుకొని తరచూ గొడవపడేవాడు. 06.06.2021న బంధువుల పెళ్లికి వెళ్లిన లక్ష్మి ఇంటికి తిరిగి రాకపోవడంతో 13.06.2021న ఆమె తల్లి కిష్టమ్మ గోనెగండ్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై Cr.No.184/2021 కింద మహిళ కనిపించడంలేదని కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం కేసును 302 IPCగా మార్చారు. అప్పటి ఎమ్మిగనూరు రూరల్ సర్కిల్ CI మంజునాథ్ దర్యాప్తు చేపట్టారు. విచారణలో ముద్దాయి దేవదాసు లక్ష్మిని గుంతకల్లు చర్చికి వెళదామని మోటార్ సైకిల్‌పై తీసుకెళ్లి, కసాపురం సమీపంలోని పొలాల్లో గొంతు నులిమి హత్య చేసినట్లు వెల్లడైంది. అనంతరం బైక్‌లోని పెట్రోల్‌తో శవాన్ని కాల్చి ఆనవాళ్లు చెరిపివేయాలని ప్రయత్నించినట్లు, ఆమె వద్ద ఉన్న బంగారు, వెండి ఆభరణాలు తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. పోలీసులు కసాపురం సమీపంలోని ఘటనాస్థలానికి చేరుకుని మృతురాలి పుర్రె మరియు ఇతర ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. సాంకేతిక ఆధారాలతో DNA పరీక్షకు పంపగా అవి మృతురాలివేనని నిర్ధారణ అయింది. అలాగే మృతురాలు, ముద్దాయి ఫోన్ డేటాను విశ్లేషించారు. సమగ్ర ఆధారాలతో కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేయగా, విచారణ అనంతరం నేరం రుజువైనందున ముద్దాయికి జీవిత ఖైదు విధించారు. కేసును పక్కాగా నమోదు చేసి దర్యాప్తు నిర్వహించిన పోలీసు అధికారులను, సాక్షులను కోర్టులో హాజరు పరిచిన కోర్టు సిబ్బందిని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రత్యేకంగా అభినందించారు.
Admin
DNB News