DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు నగరంలో జూలై 1 నుంచి 4 వరకు నిర్వహించనున్న ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణా తరగతులను విద్యార్థులు విజయవంతం చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి షాబీర్ భాష పిలుపునిచ్చారు. స్థానిక ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో శిక్షణా తరగతుల కరపత్రాలను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయకుండా కార్పొరేట్ విద్యకు ప్రోత్సాహం ఇస్తున్నారని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, ఖాళీ లెక్చరర్ పోస్టులు, ఉన్నత విద్యలో ప్రైవేటీకరణ వంటి సమస్యలపై విద్యార్థులు చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలను బలోపేతం చేసే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ శిక్షణా తరగతులకు విశ్వవిద్యాలయాల మేధావులు, అధ్యాపకులు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్, కోశాధికారి శేఖర్‌తో పాటు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.
Admin
DNB News