DNB News - ఆంధ్రప్రదేశ్ / : నగర శివార్లలో నిర్మితమైన టిడ్కో గృహాల్లో అన్ని మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపడుతున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. బుధవారం ఆయన టిడ్కో, మున్సిపల్ అధికారులతో కలిసి టిడ్కో గృహాలను పరిశీలించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా గృహాల్లో నివసిస్తున్న ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. తాగునీటి సరఫరా, విద్యుత్ దీపాల నిర్వహణ, రేషన్ బియ్యం సరఫరా, సచివాలయం ఏర్పాటు, బస్సు సౌకర్యం, ప్రాథమిక పాఠశాల వంటి అవసరాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కమిషనర్ మాట్లాడుతూ ప్రస్తుతం వారానికి రెండు సార్లు నీటి సరఫరా జరుగుతోందని, త్వరలోనే విద్యుత్ దీపాలకు మరమ్మత్తులు చేపడతామని తెలిపారు. ఈ నెలాఖరుకు 500 గృహాలు అందుబాటులోకి వస్తాయని, మరో రెండు నెలల్లో ఇంటింటికి తాగునీటి సరఫరా పూర్తవుతుందని వెల్లడించారు. టిడ్కో గృహాలు పొందిన లబ్ధిదారులు వెంటనే ఇళ్లలోకి చేరాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ రమణమూర్తి, టిడ్కో ఎస్ఈ పి.వి. శేషసాయి, ఎంఈ సూర్యనారాయణ, ఏఈ జనార్ధన్, టిడ్కో అధికారులు పెంచలయ్య, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News