DNB News - ఆంధ్రప్రదేశ్ / : నేర నియంత్రణలో ఎలాంటి రాజీ పడకుండా, నేర నివారణనే ప్రధాన లక్ష్యంగా పోలీసులు సమర్థవంతంగా పనిచేయాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ పోలీసు అధికారులకు ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో నేర నియంత్రణను మరింత కట్టుదిట్టం చేయాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ ఘటనలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సమగ్రంగా పరిశీలించి, ప్రాధాన్యత ఉన్న కేసులను 7 రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. రాత్రి గస్తీలు, విజిబుల్ పోలీసింగ్‌ను బలోపేతం చేయాలని, రౌడీ షీటర్లపై నిరంతరం నిఘా ఉంచాలని తెలిపారు. మొబైల్ రికవరీ, రోడ్డు ప్రమాదాల నివారణ, మహిళల భద్రతపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. మార్చి 28 నుంచి క్రికెట్ బెట్టింగ్‌పై కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని, డ్రోన్ కెమెరాల సహాయంతో పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని ఆదేశించారు. పెండింగ్ కేసుల దర్యాప్తులను వేగవంతంగా, పకడ్బందీగా పూర్తి చేయాలని తెలిపారు. గత నెలలో వివిధ కేసుల్లో ప్రతిభ కనబరచిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా, లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు, డీఎస్పీలు వెంకట్రామయ్య, ఉపేంద్రబాబు, భార్గవి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
Admin
DNB News