DNB News - ఆంధ్రప్రదేశ్ / : సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆదోని పట్టణంలో సోమవారం పోస్ట్ కార్డు ఉద్యమం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి విద్యార్థుల తరఫున పోస్ట్ కార్డులు పంపించారు. అనంతరం ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో పరిపాలనాధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మాట్లాడుతూ ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ మరియు కాస్మోటిక్ ఛార్జీలను రూ.3000కు పెంచాలని డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టళ్లలో ఖాళీగా ఉన్న వార్డెన్, కుక్, వాచ్‌మన్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. అలాగే అద్దె భవనాల్లో నడుస్తున్న సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని తెలిపారు. ప్రతి సంవత్సరం సంక్షేమ హాస్టళ్ల అభివృద్ధి మరియు మరమ్మతుల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని, మహిళా హాస్టళ్లలో ప్రతి నెల సానిటరీ ప్యాడ్లు పంపిణీ చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
DNB News