DNB News - ఆంధ్రప్రదేశ్ / : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలతో, రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్త ఆదేశాల మేరకు, కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పర్యవేక్షణలో పోలీసు అధికారులు, సిబ్బందికి మానసిక ఉల్లాసం మరియు సంపూర్ణ ఆరోగ్యం కోసం మూడు రోజుల ప్రత్యేక హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టిట్యూట్ సహకారంతో మే 25, 26, 27 తేదీల్లో నిర్వహిస్తున్న ఈ ధ్యాన తరగతులు కర్నూలు రేంజ్ డీఐజీ కార్యాలయం మరియు జిల్లా పోలీసు కార్యాలయం పరేడ్ మైదానంలో సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని యోగా ఆసనాలు, ప్రాణాయామం, ధ్యాన సాధనలు చేశారు. హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ ప్రతినిధులు మరియు ట్రైనర్లు పోలీసు సిబ్బందికి శ్వాసక్రియల నియంత్రణ, ఏకాగ్రత పెంపొందించే సాధనలు, మానసిక ఒత్తిడిని తగ్గించే ధ్యాన పద్ధతులపై ప్రత్యేక శిక్షణ అందించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ, ధ్యానం ద్వారా ఒత్తిడి తగ్గి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించగలమన్నారు. విధుల్లో ఎదురయ్యే మానసిక ఒత్తిడి, ఆందోళనలను తగ్గించేందుకు యోగా, ధ్యానం ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. క్రమం తప్పకుండా ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం పెంపొందడంతో పాటు విధి నిర్వహణలో మరింత సమర్థత సాధించవచ్చని పేర్కొన్నారు. అలాగే దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించడంలో యోగా, ప్రాణాయామం కీలక పాత్ర పోషిస్తాయని, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో వీటిని అలవాటు చేసుకోవాలని సూచించారు. డీఐజీ కార్యాలయం, జిల్లా పోలీసు కార్యాలయంతో పాటు సీఐడీ, ఏపీఎస్పీ రెండో బెటాలియన్, వెల్దుర్తి, కృష్ణగిరి, ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో కూడా ఈ మూడు రోజులపాటు హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ ఆధ్వర్యంలో మెడిటేషన్ తరగతులు కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమంలో ఎఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ కృష్ణమోహన్, మహిళా పీఎస్ డీఎస్పీ ఉపేంద్రబాబు, సీఐలు, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్సైలు, డీఐజీ మరియు జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది, హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ జిల్లా సమన్వయకర్త శ్రీ వెంకట రెడ్డి, ట్రైనర్లు శ్రీ రవీంద్రనాథ్, వంశీ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News