DNB News - ఆంధ్రప్రదేశ్ / : ప్రజల సమస్యలను చట్టపరంగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తామని కర్నూలు అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) హుస్సేన్ పీరా తెలిపారు. సోమవారం కర్నూల్ కొత్తపేటలోని కర్నూల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న ఎస్పీ క్యాంపు కార్యాలయంలో, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించి, ఫిర్యాదుదారులతో అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 94 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. ముఖ్య ఫిర్యాదులు: కర్నూలు మండలం బి.తాండ్రపాడు గ్రామానికి చెందిన నాగలింగం, తన కుమారుడికి కెవి సబ్ స్టేషన్‌లో కాంట్రాక్ట్ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.4 లక్షలు తీసుకుని మోసం చేసిన కర్నూలు శ్రీనగర్ కాలనీకి చెందిన నాగేంద్రుడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. గూడూరు మండలం బూడిదపాడు గ్రామానికి చెందిన చిన్న హుస్సేన్ మియా, వర్షాలకు పత్తి తడుస్తుందని ఇంటిని అద్దెకు ఇచ్చానని, అయితే 10 సంవత్సరాలుగా ఇల్లు ఖాళీ చేయకపోవడంతో పాటు అద్దె కూడా చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ న్యాయం చేయాలని కోరారు. తుగ్గలి మండలం ఎద్దులదొడ్డి గ్రామానికి చెందిన దస్తగిరమ్మ, తన 16 ఎకరాల పొలాన్ని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఎమ్మిగనూరుకు చెందిన జయమ్మ, తన ఇల్లు ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. కర్నూలు పాతబస్తీ బూడెం ఖాన్ మసీదుకు చెందిన మునీర్ తదితరులు, వార్త ఆఫీస్ సమీపంలోని వక్ఫ్ బోర్డు స్థలంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చిన ప్రతి ఫిర్యాదుపై చట్ట ప్రకారం విచారణ జరిపి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐలు శివశంకర్, రామయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News