DNB News - ఆంధ్రప్రదేశ్ / : గత ప్రభుత్వ హయాంలో పట్టణ పొలిమేరలో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీ పేరుతో రూ.128 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని ఎమ్మెల్యే పార్థసారథి ఆరోపించారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి సమగ్ర విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. గురువారం ఆయన జగనన్న కాలనీలో అసంపూర్తిగా మిగిలిపోయిన, నాసిరకంగా నిర్మించిన గృహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఈ కుంభకోణాన్ని వెలికితీసే దిశగా సీఎం చంద్రబాబు నాయుడు మరియు సంబంధిత మంత్రులకు పలుమార్లు వివరించినట్లు పేర్కొన్నారు. పేదల గృహ నిర్మాణం కోసం రైతుల నుంచి 178 ఎకరాల భూమి కొనుగోలుకు ప్రభుత్వం రూ.24 కోట్లు కేటాయించగా, రైతులకు కేవలం రూ.8 కోట్లు మాత్రమే అందజేసి మిగతా నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆరోపించారు. అలాగే 5000 గృహాలు నిర్మించాల్సి ఉండగా, తక్కువ నాణ్యతతో సగం పనులు మాత్రమే పూర్తి చేసి 4000 గృహాలు పూర్తయ్యాయని ప్రకటించడం అనుమానాస్పదమని విమర్శించారు. తలుపులు, ఫ్లోరింగ్, ప్లాస్టరింగ్, ఎలక్ట్రికల్ పనులు పూర్తి కాకుండానే ఇళ్లను పూర్తి చేసినట్లు చూపించడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. గృహ లబ్ధిదారులైన మహిళలు డ్వాక్రా సంఘాల ద్వారా రూ.30 వేల నుండి రూ.60 వేల వరకు అప్పులు చేసి కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి వచ్చిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి మంజూరు చేసిన రూ.1,80,000 నగదును కూడా కాంట్రాక్టర్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆరోపించారు. జగనన్న కాలనీ లబ్ధిదారులైన సుమారు 5 వేల మంది ప్రస్తుతం ఇల్లు, స్థలాలపై అనిశ్చితిలో ఉన్నారని, వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కుంభకోణంపై పూర్తి స్థాయి విచారణలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన అంశాలు ట్రైలర్ మాత్రమేనని, పూర్తి నిజాలు బయటకు రావాల్సి ఉందని ఎమ్మెల్యే పార్థసారథి తెలిపారు.
Admin
DNB News