DNB News - ఆంధ్రప్రదేశ్ / : విజయవాడలోని హ్యాండ్లూమ్స్ మరియు టెక్స్టైల్స్ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న క్లాత్ వేస్టేజ్ నుండి బ్యాగులు తయారు చేసే యూనిట్‌ను ఆముదాలవలస నియోజకవర్గ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియుసి చైర్మన్ కూన రవికుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ తయారవుతున్న ఉత్పత్తులను పరిశీలించి, వ్యర్థ వస్త్రాలను వినియోగించి పర్యావరణ హితమైన బ్యాగులు తయారు చేసే విధానంపై అధికారులతో సమగ్రంగా చర్చించారు. అలాగే, ఆ యూనిట్‌లో మహిళలకు అందిస్తున్న శిక్షణ విధానం, తయారీ ప్రక్రియ, మార్కెటింగ్ అవకాశాలు వంటి అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. మహిళలకు తక్కువ పెట్టుబడితో, స్వయం ఉపాధి సాధించే అవకాశాలు ఈ యూనిట్ ద్వారా ఎలా కల్పిస్తున్నారో అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆముదాలవలస నియోజకవర్గంలో మహిళా సోదరీమణుల కోసం మరిన్ని ఉపాధి అవకాశాలు సృష్టించాల్సిన అవసరం ఉందని తెలిపారు. క్లాత్ వేస్టేజ్ నుండి బ్యాగుల తయారీ యూనిట్‌ను ఆముదాలవలసలో ప్రారంభించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. దీనివల్ల స్థానిక మహిళలకు ఉపాధి లభించడంతో పాటు కుటుంబాల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో సంబంధిత శాఖలతో చర్చించి, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి యూనిట్ స్థాపనకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కూన రవికుమార్ స్పష్టం చేశారు.
Admin
DNB News