DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలో పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా ప్రధాన ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ మ్యాట్ రూఫ్‌లు ఏర్పాటు చేయాలని స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ నహీమ్ అహ్మద్ కి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో SFI జిల్లా ఉపాధ్యక్షుడు, పట్టణ అధ్యక్షుడు, కార్యదర్శులు సంజయ్, శశిధర్, అలాగే DYFI పట్టణ అధ్యక్షుడు మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా ఆదోని పట్టణంలో తీవ్రమైన ఎండలు నమోదవుతున్నాయని, రోడ్లపై ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎండ తీవ్రత వల్ల సన్‌స్ట్రోక్‌కు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వాహనదారులకు ఉపశమనం కల్పించే ఉద్దేశంతో నగరంలోని ప్రధాన ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ మ్యాట్‌తో రూఫ్‌లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కర్నూలు నగరంలో ఇలాంటి ఏర్పాట్లు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే ఎండల కారణంగా ప్రజలు, ప్రయాణికులు తాగునీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటూ, బస్టాప్‌లు మరియు రద్దీ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి దాహార్తిని తీర్చాలని మున్సిపల్ అధికారులను విజ్ఞప్తి చేశారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తక్షణమే చర్యలు తీసుకోవాలని SFI నాయకులు కోరారు.
Admin
DNB News