DNB News - తెలంగాణ / : విద్యార్దులు కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకోవడమే తల్లిదండ్రులకు ఇచ్చే అతి పెద్ద బహుమతి విద్యార్దులకు నాణ్యమైన, పౌష్టికాహారం మెనూ ప్రకారం అందించాలి ఖమ్మం అర్బన్ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, పదవ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షల పై అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్ విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవడమే తల్లిదండ్రులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి అని, ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పదవ తరగతి పరీక్షలకు హాజరుకావాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఆదివారం ఖమ్మం అర్బన్ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, పరిసరాలను తిరుగుతూ, మౌళిక సదుపాయాలు, వంటగది పరిశుభ్రత, ఆహార నాణ్యత, నిల్వ విధానాలు, స్టోర్ రూమ్‌లో ఉన్న బియ్యం, పప్పులు, కూరగాయలు, ఇతర సరుకుల సామగ్రిని తనిఖీ చేసి, రికార్డు రిజిష్టర్ల ను పరిశీలించారు. కామన్ మెనూ ప్రకారం ఆదివారం విద్యార్థులకు అందించుటకు వండుతున్న ఆహారాన్ని బగారా రైస్, మటన్ కూరను పరిశీలించారు. పరిసరాలలో నీటి నిల్వలు ఉండకుండా ఇంకుడుగుంతను ఏర్పాటు చేయాలని, గ్రౌండ్ స్ధలంను శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులతో నేరుగా ముచ్చటించి పాఠశాలలో కల్పిస్తున్న వసతుల గురించి, మెస్ కమిటీ వివరాలు అడిగి తెలుసుకుని, కమిటీ సమావేశాలు నియమితంగా నిర్వహించాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని , మెనూకు అనుగుణంగా నాణ్యమైన, పౌష్టికాహారం అందించాలని, అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం కలెక్టర్ పదవ తరగతి గది సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. ఇప్పటి వరకు వ్రాసిన పరీక్షల వివరాలను అడిగి వారి చదువు, లక్ష్యాలు, ఆశయాల గురించి తెలుసుకుని, చదువును ఇష్టంతో చదివి భవిష్యత్ లో ఉన్నత స్థాయికి చేరుకొని మీ తల్లిదండ్రులకు, మన జిల్లాకు మంచి పేరు తేవాలని, మరో రెండు ఎగ్జామ్స్ ఏలాంటి భయం, ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలకు సిద్దం కావాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదువు పై దృష్టి పెట్టి పరీక్షలకు హాజరు కావాలని, ఉన్న మరో రెండు పరీక్షలకు ఉన్న సమయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మనం చదువు పై నమ్మకంగా ఉంటూ పరీక్షలకు హాజరైతే మంచి ఫలితాలు వస్తాయని, ఈసారి పరీక్షలు నెల రోజుల పాటు నిర్వహిస్తున్నారని, పరీక్షల మధ్య ఎక్కువ రోజుల సమయం రావడం వలన విద్యార్థులకు మంచి వెసులుబాటు కల్గిందని అన్నారు. విద్యార్దుల కెరీర్‌లో పదవతరగతి, ఇంటర్ ముఖ్యమైన దశలని, ఏకాగ్రతతో సిద్దమైతే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్ తెలిపారు. మనకు అందుబాటులో ఉన్న అవకాశాలను సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ, గొప్ప స్థాయికి చేరుకోవాలని, పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, ఒక్కో మెట్టు ఎక్కుతూ, నిర్దేశించుకున్న లక్ష్యాల సాధన దిశగా కృషి చేయాలని, కొన్ని సందర్భాలలో విఫలం అయిన మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూ అనుకున్న రంగాలలో మంచి స్థాయికి చేరుకోవాలని కలెక్టర్ అన్నారు. మనం ఎంత సమయం చదువుతున్నాం అనే దానికంటే, ఎంత శ్రద్ధగా చదువుతున్నా మనేది చాలా ముఖ్యమని తెలిపారు. ఉపాధ్యాయుల సహకారం తీసుకుంటూ పరీక్షలకు బాగా సన్నద్ధం కావాలని, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని కలెక్టర్ సూచించారు. ప్రతి రోజు మంచి నిద్ర ఉండాలని, ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో బయట ఆహారం తీసుకోవద్దని, బయట ఎక్కువ తిరగవద్దని, మంచినీరు తగినంత త్రాగాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి పెసర ప్రభాకర్ రెడ్డి , జిల్లా జెండర్ ఈక్విటీ కోఆర్డినేటర్ రూబీ, ఖమ్మం అర్బన్ మండల ఎంఈఓ శైలజ లక్ష్మీ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News