DNB News - తెలంగాణ / : హైదరాబాద్: మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసును పోలీసులు కేవలం ఆరు గంటల్లోనే ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం… మార్చి 15 రాత్రి దాదాపు 8 గంటల 30 నిమిషాల సమయంలో చిలకానగర్ గ్రౌండ్ వద్ద సుధీర్ కుమార్ అనే వ్యక్తిని అతని స్నేహితులు సంతోష్, తరుణ్ కత్తితో దాడి చేసి హత్య చేశారు. ముందుగా సుధీర్ కుమార్ మరియు నిందితుడు సంతోష్ మధ్య పాత వివాదాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో సంతోష్ తన స్నేహితుడు తరుణ్‌తో కలిసి సుధీర్ కుమార్‌ను చిలకానగర్ గ్రౌండ్‌కు పిలిచాడు. అక్కడ జరిగిన వాగ్వాదం తలెత్తడంతో సంతోష్ కత్తితో సుధీర్‌పై దాడి చేశాడు. సుధీర్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించగా ఇద్దరు నిందితులు వెంటపడి పలుమార్లు కత్తితో పొడవడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆరు గంటల్లోనే నిందితులు బనోతు సంతోష్, పొడిశెట్టి తరుణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, రెండు సెల్ ఫోన్లు, ఒక ఆక్టివా బైక్‌తో పాటు నిందితుల దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీసీపీ కె. సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ఉప్పల్ పోలీసులు ఈ కేసును త్వరగా ఛేదించినట్లు అధికారులు తెలిపారు.
Admin
DNB News