DNB News - తెలంగాణ / : ఆస్పరి మండలంలో పదివేల జనాభా ఉన్న మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో మూడు వారాలకు ఒకసారి మాత్రమే మంచినీరు సరఫరా చేయడం అత్యంత బాధాకరమని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి ఎ. నూర్ అహ్మద్ తెలిపారు. ఆస్పరిలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి కృషి చేయాలని ఆయన కోరారు. తాగునీటి కొరత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా మహిళలు, చిన్నారులు తీవ్రంగా ప్రభావితమవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నీటి కొరత వల్ల ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా పదికోన రిజర్వాయర్ లేదా హంద్రీ-నీవా కాల్వ నుంచి నీటిని ఆస్పరికి తరలించాలని సూచించారు. అలాగే ఆస్పరి సమీపంలో సమ్మర్ స్టోరేజ్ చెరువు నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత వేసవిని దృష్టిలో ఉంచుకుని యుద్ధప్రాతిపదికన ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని అధికారులను కోరారు. అలూరు నియోజకవర్గం నుంచి గత ఇరవై సంవత్సరాలలో ఇద్దరు నాయకులు మంత్రులుగా పనిచేసినప్పటికీ, కనీస సౌకర్యాలు మరియు తాగునీటి సమస్య పరిష్కారంలో విఫలమయ్యారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మరియు నాయకులు నియోజకవర్గ అభివృద్ధి, తాగునీటి సమస్యకు దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఆస్పరి తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని మరోసారి ప్రభుత్వం, అధికారులను ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎం.హెచ్.పి.ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎ. నూర్ అహ్మద్‌తో పాటు నాయకులు నాడంగ్ షకీల్ పాల్గొన్నారు.
Admin
DNB News