DNB News - తెలంగాణ / : పార్టీ ఫిరాయింపు వ్యవహారంపై స్పీకర్ తీసుకోనున్న నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. కోర్టు నిర్దేశించిన గడువు ప్రకారం విచారణ పూర్తవడంతో ఈరోజు ఉదయం 10 గంటలకు స్పీకర్ కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. బీఆర్‌ఎస్ పార్టీ తరఫున దానం నాగేందర్ ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి, అలాగే కడియం శ్రీహరి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. తరువాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో దానం నాగేందర్ సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. ఇక కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్ టికెట్‌పై వరంగల్ ఎంపీ స్థానానికి పోటీ చేసి విజయం సాధించారు. పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగతా ఎనిమిది మంది ఎమ్మెల్యేల విషయంలో స్పష్టమైన ఆధారాలు లేవని, వారు ఇప్పటికీ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలుగానే ఉన్నారని స్పీకర్ విచారణ అనంతరం ప్రకటించారు. అయితే దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. దానం నాగేందర్ కాంగ్రెస్ టికెట్‌పై ఎంపీగా పోటీ చేసిన విషయాన్ని ఎన్నికల సంఘం వద్ద ఆధారాలు నిర్ధారించాయి. అలాగే కడియం శ్రీహరి తన కుమార్తె తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు బీఆర్‌ఎస్ పార్టీ స్పీకర్‌కు ఆధారాలు సమర్పించింది. ఈ నేపథ్యంలో ఈరోజు స్పీకర్ తీసుకునే నిర్ణయం ఇద్దరు ఎమ్మెల్యేల రాజకీయ భవితవ్యాన్ని తేల్చే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో స్పీకర్ ప్రకటనపై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.
Admin
DNB News