DNB News - తెలంగాణ / : కుంభమేళా తరహాలోనే గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. “గోదావరి పుష్కరాలు–2027”ను తెలంగాణ బ్రాండ్ ప్రతిబింబించేలా నిర్వహించేందుకు క్యాబినెట్ సబ్ కమిటీ ప్రణాళికలు రూపొందిస్తోంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశంలో ఈ అంశంపై సమగ్రంగా చర్చించారు. ఈ సమావేశానికి మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. వేద పండితుల నిర్ణయం ప్రకారం 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు ఆది పుష్కరాలు, 2028 జూలై 13 నుంచి 24 వరకు అంత్య పుష్కరాలు నిర్వహించనున్నారు. ఈ పుష్కరాలకు సుమారు 8 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశముందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. గోదావరి ప్రవహించే జిల్లాల్లో ప్రముఖ దేవాలయాలను అనుసంధానిస్తూ మొత్తం 96 ప్రాంతాలను పుష్కర ఘాట్లుగా ప్రత్యేకంగా ఎంపిక చేశారు. గత పుష్కరాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాంతాల్లో ఘాట్లు, రహదారులు, తాగునీరు, పారిశుధ్యం వంటి మౌలిక వసతులను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రులు తెలిపారు. ఈ నెలాఖరుకల్లా డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి దశలో అధిక రద్దీ ఉండే తొమ్మిది ప్రాంతాలను “టైర్–1”గా గుర్తించి అక్కడ యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టనున్నారు. పుష్కరాల నిర్వహణలో సమన్వయ లోపం తలెత్తకుండా ప్రత్యేక స్పెషల్ ఆఫీసర్‌ను నియమించడంతో పాటు ప్రతి శాఖకు నోడల్ అధికారులను కూడా నియమించనున్నారు. ప్రతి ఘాట్ వద్ద ట్రాఫిక్ నియంత్రణ, అత్యవసర మార్గాలు, ఆధునిక వైద్య సదుపాయాలు, పార్కింగ్ ఏర్పాట్లు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. పుష్కరాల ఏర్పాట్లలో ఎలాంటి రాజీ ఉండదని, నాణ్యతతో పనులు పూర్తి చేయాలని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు.
Admin
DNB News