DNB News - తెలంగాణ / : ఖమ్మం జిల్లాలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణపై సన్నాహక సమావేశం జరిగింది. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జి మంత్రి వాకిటి శ్రీహరి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, జారే ఆదినారాయణ, మాలోతు రాందాస్ నాయక్, తెల్గం వెంకట్రావు, కోరం కనకయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 99 రోజుల కార్యాచరణలో చేపట్టే కార్యక్రమాలపై ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు 99 రోజుల కార్యాచరణను ప్రణాళిక ప్రకారం అమలు చేయాలని అధికారులకు సూచించారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ప్రజల గడపకు చేరేలా అధికారులు కృషి చేయాలని అన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందాలని తెలిపారు. రైతులు పండించే పంటలకు బోనస్ ఇవ్వడంతో పాటు పేదలకు నాణ్యమైన సన్న బియ్యం రేషన్ ద్వారా అందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పేదలకు సంక్షేమ కార్యక్రమాలను చేరవేసేందుకు, భవిష్యత్తు ప్రణాళిక రూపొందించేందుకు ప్రభుత్వం 99 రోజుల కార్యాచరణ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ప్రతి గ్రామం, పట్టణంలో ఈ కార్యక్రమం సమర్థవంతంగా అమలు కావాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్లకు ప్రత్యేక అధికారులను ఇంచార్జ్‌లుగా నియమించి వారానికి ఒకసారి పరిశీలించాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న యంత్రాలను పూర్తిగా వినియోగించేలా అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా డ్రైనేజీ సమస్యలు ఉన్న ప్రాంతాలను గుర్తించి అవసరమైన మరమ్మత్తు పనులు చేపట్టాలని సూచించారు. అలాగే రెవెన్యూ, అటవీ శాఖల మధ్య ఉన్న భూ సమస్యలను జాయింట్ సర్వే ద్వారా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, భద్రాచలం ఐటిడిఎ పీవో రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, జెడ్పీ సీఈఓ దీక్షా రైనా తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Admin
DNB News