DNB News - తెలంగాణ / : హయత్ నగర్ లో రూ.10 కోట్ల రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు. - హాజరైన మధుయాష్కి గౌడ్ గారు, మల్‌రెడ్డి రాంరెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రహదారుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా, హయత్‌నగర్ పరిధిలోని తొర్రూరు ఎక్స్ రోడ్ వద్ద ఉన్న సాయి బాబా దేవాలయం నుండి జీ హై స్కూల్ వరకు రూ.10 కోట్ల వ్యయంతో రెండు వరుసల రహదారిని నాలుగు వరుసల రహదారిగా విస్తరించే పనులకు రాష్ట్ర రోడ్లు & భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు గౌరవ శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ గౌరవ శ్రీ మధుయాష్కి గౌడ్ గారు, తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గౌరవ శ్రీ మల్‌రెడ్డి రాంరెడ్డి గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ… రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు మల్‌రెడ్డి రాంరెడ్డి చైర్మన్‌గా ఉండటం ఈ ప్రాంతానికి ఎంతో అదృష్టకరమని అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో రహదారి అభివృద్ధి పనులు వేగవంతంగా జరిగేలా ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, ప్రభుత్వంతో సమన్వయం చేస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తున్నారని ప్రశంసించారు. చింతల్‌కుంట చెక్‌పోస్ట్ నుంచి హయత్‌నగర్ మీదుగా ఆల్ ఇండియా రేడియో స్టేషన్ వరకు సుమారు 5½ కిలోమీటర్ల పొడవున రూ.950 కోట్ల వ్యయంతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని తెలిపారు. ఈ ప్రాజెక్టును నాగ్‌పూర్ నగరంలో ఉన్న నమూనాను ఆదర్శంగా తీసుకొని డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ రూపంలో నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గి, ప్రజలకు వేగవంతమైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ… మల్‌రెడ్డి రాంరెడ్డి రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత ఎల్బీనగర్ ప్రాంతంలో రహదారి అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగుతున్నాయని అన్నారు. ప్రాంతీయ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పలు కీలక రహదారి ప్రాజెక్టులను తీసుకురావడంలో ఆయన ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. హైవే పై ప్రతిపాదించిన డబుల్ డెక్కర్ రోడ్డు నిర్మాణ ప్రాజెక్టు అమలుకు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా మల్‌రెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ, ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో పలు రహదారుల అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే సుమారు రూ.400 కోట్ల విలువైన రహదారి పనులకు సోమవారం టెండర్లు ఆహ్వానించగా, మరిన్ని రూ.600 కోట్ల విలువైన పనులు ప్రాసెసింగ్‌లో ఉన్నట్లు వివరించారు. అదేవిధంగా జీ హై స్కూల్ నుండి రేడియో స్టేషన్ వరకు రహదారిని విస్తరించడంతో హయత్‌నగర్ ప్రాంతానికి ప్రత్యామ్నాయ మార్గం ఏర్పడి ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గుతాయని పేర్కొన్నారు. ఇక హయత్‌నగర్ నుండి తొర్రూరు, అనాజ్‌పూర్ మీదుగా కోహెడ ఫ్రూట్ మార్కెట్ వరకు రూ.200 కోట్ల వ్యయంతో హామ్ (HAM) విధానంలో రహదారి నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని తెలిపారు. అలాగే హయత్‌నగర్ నుండి సాగర్ రోడ్డులోని ఇంజాపూర్ వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా హయత్‌నగర్ నుండి తారామత్‌పేట్ వరకు కుంట్లూరు, పసుమాముల మీదుగా నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి కూడా ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ రహదారులు పూర్తయ్యాక ప్రాంతీయంగా రవాణా సౌకర్యాలు మెరుగుపడి ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డిఅన్నారం మార్కెట్ ఛైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముద్దగోని రామ్మోహన్ గౌడ్ , జక్కిడి ప్రభాకర్ రెడ్డి , మాజీ కార్పొరేటర్లు రాజశేఖర్ రెడ్డి , వెంకటేశ్వర్ రెడ్డి , మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు, స్థానిక నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
DNB News